Monday 26 May 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 2 (అర్లాఫ్ వజ్రం)

దీని ప్రస్తుత బరువు 189.62 కేరెట్లు. కనుగొన్నపుడు దీని బరువు 300 కెరేట్లుగా భావించబడుతుంది. రంగు నీలం కలిసిన ఆకుపచ్చ. ఇది అత్యంత శుద్దమైనది.


దీని చరిత్రను పరిశీలిస్తే, ఇది మొదటగా శ్రీరంగం లోని ఒక విష్ణు దేవాలయంలో గల విగ్రహం యొక్క కన్నుగా అమర్చబడి వుండేదట. దీనిని హిందువులా వేషం ధరించిన ఒక ఫ్రెంచి సైనికుడు 1700 ల ప్రాంతంలొ అపహరించాడట. అతను మద్రాసు చేరుకొని అక్కడ ఒక ఓడ కెప్టెనుకు 2,000 పౌండ్లకు అమ్మాడట.



కాలక్రమంలో ఇది ఆంస్టరడం చేరుకొంది. అక్కడ దీనిని రష్యాకు చెందిన గ్రెగొరి అర్లాఫ్ (Grigori Orloff) 90,000 పౌండ్లకు కొనడం జరిగింది. దానిని అతను తన మాజీ ప్రియురాలైన కేథరీన్ ది గ్రేట్ కు కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి దీనికి అర్లాఫ్ వజ్రం అని పేరు వచ్చింది.


కాని కేథరీన్ ఈ వజ్రాన్ని తీసుకుంది గాని గ్రెగోరి కి మాత్రం దక్కలేదు. ఆ దిగులుతోనే గ్రెగోరి 1783 లొ మరణించాడు. కేథరీన్ ఈ వజ్రాన్ని తన రాజ దండం లొ అమర్చుకుంది. తర్వాత 1812 లొ రష్యనులు మాస్కో పై నెపోలియన్ దాడికి భయపడి ఒక పూజారి సమాధిలొ దీనిని దాచారట. కానీ నెపోలియన్ ఈ దాచిన స్తలాన్ని కనుక్కొని దీనిని తీసుకోవటానికి సమాధి దగ్గరకి వచ్చాడట. కాని సరిగ్గా ఒక సైనికుడు ఈ వజ్రాన్ని తాకబోతుండగా పూజారి అత్మ ప్రత్యక్షం అయ్యి భయంకరమైన శాపం పెట్టిందట. దానికి భయపడి నెపోలియన్ ఈ వజ్రాన్ని తీసుకోకుండానే వెనుదిరిగాడట. ప్రస్తుతానికి ఇది మాస్కో లోని రష్యన్ డైమండ్ ఫండ్ లో భద్రపరచబడి వున్నది.

Wednesday 21 May 2008

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల విశేషాలు - భాగం - 1 (కలినాన్ వజ్రం)

ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల గురించి నాకు తెలిసిన వివరాలు తెలియచేయటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఒక్కొక్క భాగంలో ఒక్కో వజ్రాన్ని గురించిన విశేషాలు రాస్తాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.

కలినాన్ I: ఇది ప్రపంచంలొ కట్ చేయబడిన వజ్రాలలో పెద్దది. దీని బరువు 530.20 కేరెట్లు (106.04 గ్రాములు). దీనిని దక్షిణాఫ్రికా లోని ట్రాన్స్ వాల్ లో 1905 వ సంవత్సరం లొ కనుగొనటం జరిగింది. దక్షినాఫ్రికా లోని కలినాన్ లొ వున్న ప్రీమియర్ డైమండ్ మైనింగ్ కంపెనీ లొ పని చేసే ఫ్రెడెరిక్ వెల్స్ అనే ఆయన ఈ వజ్రాన్ని కనుకున్నాడు. దీనిని కనుగొన్న కంపెని పనిచేసే వూరి పేరునే దీనికి పెట్టటం జరిగింది.

జోసెఫ్ అశ్చెర్, కంపెని ఆఫ్ ఆంస్టర్డం కలిసి సుమారు 6 నెలలు పరీక్షించి చివరికి మూల వజ్రం అయిన కలినాన్ ను 105 అద్భుతమైన వజ్రాలుగా (9 పెద్ద వజ్రాలు 96 చిన్నవజ్రాలు) కట్ చెయ్యటం జరిగింది. అసలు వజ్రం బరువు 3106.75 కేరెట్లు. కట్ చేసిన వజ్రాలలొ అతి పెద్దదానికి కలినాన్ I అని పేరు పెట్టారు. దీనినే గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా(Great Star of Africa)అని కూడ అంటారు. ఇది 74 ముఖాలను కలిగి ఉంటుంది.

1907 లో ఈ వజ్రాన్ని ఇంగ్లండు రాజు అయిన ఏడవ కింగు ఎడ్వర్డు (King Edward VII of England) కి ఇవ్వటం జరిగింది. దానిని అతడు తన రాజ దండం లో అమర్చుకోవటం జరిగింది. ప్రస్తుతానికి ఇది మిగిలిన బ్రిటీషు రాజ వంశస్థుల ఆభరణాలతో పాటు టవర్ ఆఫ్ లండన్ లో భద్రపరచబడి వుంది. మూల వజ్రం నుంచి విడగొట్టబడిన రెండో అతి పెద్ద వజ్రానికి కలినాన్ II అని పేరు పెట్టటం జరిగింది. దీని బరువు 317.40 కేరెట్లు. దీని రంగు తెలుపు. ఇది కూడా టవర్ ఆఫ్ లండన్ లో భద్రపరచబడి వుంది.

1985 లొ గొల్డెన్ జూబిలి వజ్రం (545.67 కేరెట్లు) కనుగొనేంతవరకు ప్రపంచంలో సాన పెట్టబడిన వజ్రాలలో అతి పెద్ద వజ్రంగా కలినాన్ చెలామణి అయింది. మొదటి సారి కలినాన్ వజ్రం కనుగొనబడినప్పుడు లభించిన కొన్ని గుర్తుల ఆధారంగా అది ఇంకా చాలా పెద్ద వజ్రంలో భాగమని భావించటం జరిగింది. కాని ఇప్పటివరకు మిగిలిన భాగం ఎమైందొ తెలియలేదు.

Thursday 15 May 2008

100 కోట్ల తర్వాతి అంకెలు

మీరు ఎప్పుడైనా 100 కోట్ల తర్వాతి అంకెలు లెక్కించటం ఎలా అని అలోచించారా?

మన పూర్వీకులు మనకోసం ఈ పని ఎప్పుడో చేసిపెట్టారు. క్రింద ఇవ్వబడిన అంకెలు మన వేదాలలో వాడబడినవి.

అర్బుదం (10 టు ది పవర్ ఆఫ్ 10) {సహస్ర కోటి, 1000 కోట్లు}

మహార్బుదం (10 టు ది పవర్ ఆఫ్ 11)

ఖర్వం (10 టు ది పవర్ ఆఫ్ 12)

మహాఖర్వం (10 టు ది పవర్ ఆఫ్ 13)

పద్మం (10 టు ది పవర్ ఆఫ్ 14)

మహాపద్మం (10 టు ది పవర్ ఆఫ్ 15)

క్షోణి (10 టు ది పవర్ ఆఫ్ 16)

మహాక్షోణి (10 టు ది పవర్ ఆఫ్ 17)

శంఖం (10 టు ది పవర్ ఆఫ్ 18)

మహాశంఖం (10 టు ది పవర్ ఆఫ్ 19)

క్షితి (10 టు ది పవర్ ఆఫ్ 20)

మహా క్షితి (10 టు ది పవర్ ఆఫ్ 21)

క్షోభం (10 టు ది పవర్ ఆఫ్ 22)

మహా క్షోభం (10 టు ది పవర్ ఆఫ్ 23)

నిధి (10 టు ది పవర్ ఆఫ్ 24)

మహా నిధి (10 టు ది పవర్ ఆఫ్ 25)

పర్వతం (10 టు ది పవర్ ఆఫ్ 26)

పరార్థం(10 టు ది పవర్ ఆఫ్ 27)

అనంతం (10 టు ది పవర్ ఆఫ్ 28)

సాగరం (10 టు ది పవర్ ఆఫ్ 29)

అవ్యయం (10 టు ది పవర్ ఆఫ్ 30)

అమృతం (10 టు ది పవర్ ఆఫ్ 31)

అచింత్యం (10 టు ది పవర్ ఆఫ్ 32)

అమేయం (10 టు ది పవర్ ఆఫ్ 33)

భూరి (10 టు ది పవర్ ఆఫ్ 34)

మహా భూరి (10 టు ది పవర్ ఆఫ్ 35)

వృందం (10 టు ది పవర్ ఆఫ్ 36)

...

...

...

మహౌఘం (10 టు ది పవర్ ఆఫ్ 55){రావణాసురిడి సైనిక బలం}

Friday 9 May 2008

బ్రహ్మ...పగలు...రాత్రి...రోజు...

మనందరికీ ఒక రోజు అంటే 24 గంటలు, ఒక రోజులో ఒక పగలు, ఒక రాత్రి ఉంటాయి. మరి మనల్ని సృష్టించే బ్రహ్మ కి ఒక పగలు, ఒక రాత్రి, ఒక రోజు, అంటే ఎంత?

ఆరు కనురెప్పలపాటు ఒక విఘడియ

60 విఘడియలు ఒక ఘడియ

7.5 ఘడియలు ఒక జాము

8 జాములు ఒక రోజు

7 రోజులు ఒక వారం

రెండు వారాల ఒక రోజు ఒక పక్షం

రెండు పక్షాలు ఒక నెల

పన్నెండు నెలలు ఒక సంవత్సరం

అలాంటి 4,32,000 సంవత్సరాలు ఒక "కలియుగం"

దీనికి రెండు రెట్లు (ద్వి + పర = ద్వాపర) అంటే 8,64,000 సంవత్సరాలు "ద్వాపర యుగం"

కలియుగానికి (త్రి) మూడు రెట్లు అంటే 12,96,000 సంవత్సరాలు "త్రేతా యుగం"

అదే కలియుగానికి (కృత) నాలుగు రెట్లు అంటే 17,96,000 సంవత్సరాలు "కృత యుగం"

ఈ నాలుగు యుగాలు కలిసిన మొత్తం అంటే 43,20,000 సంవత్సరాలు ఒక "మహాయుగం".

ఇది బ్రహ్మకి ఒక పగలు

అలాగే మరొ మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు ఒక రాత్రి

వెరసి 86,40,000 సంవత్సరాలు బ్రహ్మకి ఒక రోజు

ఇటువంటి రోజులు వంద బ్రహ్మగారి పరమాయుర్ధాయం

వాటిలొ మొదటి 50 రొజులు గడచిపోయి (పూర్వార్థం)ద్వితీయ పరార్థం (రెండవ 50 రోజుల్లొ మొదటి రోజు) ప్రారంభంలొ మనం ఉన్నాం

Thursday 8 May 2008

ఇదే నా మొదటి తెలుగు బ్లాగు

నమస్కారం, నాకు తెలిసిన విషయాలను తెలుగు లో పదిమందితో పంచుకోవాలని ఈ బ్లాగు మొదలుపెట్టాను. నేను ఈ బ్లాగు రాయటానికి ప్రోత్సహించిన నా స్నేహితుడు, మరియు సహోద్యోగి ఉదయ్ ప్రత్తి కి ధన్యవాదములు. ఆలాగే నాకు బ్లాగు అంటే ఎమిటో తెలియచెప్పిన నా మరో స్నేహితుడు మనీష్ కు కూడ ధన్యవాదములు.

శేష సాయి